JEE Main జేఈఈ మెయిన్‌ తొలివిడత సాధ్యమేనా? పలు అంశాలపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు ఇప్పటికే కోర్టుల్లో పిటిషన్లు

 జేఈఈ మెయిన్‌ తొలివిడత సాధ్యమేనా?

పలు అంశాలపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు

ఇప్పటికే కోర్టుల్లో పిటిషన్లు

జాతీయ బాలల పరిరక్షణ కమిషన్‌కు కూడా ఫిర్యాదులు

జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ సమయంలోనే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు
ఇంటర్‌లో 75 శాతం మార్కుల నిబంధనపైనా వ్యతిరేకత

అభ్యర్థుల డిమాండ్లపై ఇంకా స్పందించని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ


అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌-2023 జనవరి సెషన్‌ పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొందరు బాంబే హైకోర్టులో పరీక్ష వాయిదాను కోరుతూ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.
మరోవైపు అభ్యర్థులు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌)కు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్థులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌సీపీసీఆర్‌ పరీక్షల షెడ్యూల్‌ మార్పు అంశాన్ని పరిశీలించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జేఈఈ మెయిన్‌-2023 జనవరి సెషన్‌ పరీక్షల నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 

అభ్యర్థుల అభ్యంతరాలు ఇవే..
జేఈఈ మెయిన్‌-2023ని రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ డిసెంబర్‌ 15న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలి సెషన్‌ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో సెషన్‌ను ఏప్రిల్‌ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి సెషన్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది.
అయితే జనవరిలో సీబీఎస్‌ఈ సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్‌ బోర్డుల ప్రీ ఫైనల్‌ పరీక్షలు, ప్రాక్టికల్‌ పరీక్షలు ఉన్నాయి. దీనివల్ల జేఈఈ మెయిన్‌ పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని తాము కోల్పోవలసి వస్తుందని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

2021, 2022లో జేఈఈ మెయిన్‌లో విజయం సాధించినా అవకాశం అందుకోలేక డ్రాపర్లుగా మిగిలిపోయిన అభ్యర్థులు కూడా పరీక్ష సన్నద్ధతకు తమకు సమయం లేకుండా పోతోందని అంటున్నారు. దీనివల్ల తాము మళ్లీ నష్టపోతామని పేర్కొంటున్నారు.

ఇవే కాకుండా జేఈఈ మెయిన్‌కు ఎన్‌టీఏ పేర్కొన్న అర్హతల్లోనూ కొన్ని సడలింపులు ఇవ్వాలని కొందరు తొలి నుంచి కోరుతున్నారు. ఈ అర్హతలపైన కూడా న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 
ఇంటర్‌లో 75 శాతం ఉత్తీర్ణత నిబంధనపైనా..
ఇంకోవైపు జేఈఈ అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను ఎన్‌టీఏ గత మూడేళ్లుగా రద్దు చేసింది. కోవిడ్‌ కారణంగా తరగతులు, పరీక్షలు జరగకపోవడంతో ఈ మేరకు వెసులుబాటు ఇచ్చింది. అయితే కోవిడ్‌ తగ్గుముఖం పట్టడం, కళాశాలలు రెగ్యులర్‌గా నడుస్తుండటంతో ఈసారి మళ్లీ 75 శాతం మార్కుల నిబంధనను పునరుద్ధరించింది.

జేఈఈ మెయిన్‌లో మంచి స్కోరు సాధించిన అభ్యర్థులు ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు తదితర సంస్థల్లో ప్రవేశాలు పొందాలంటే ఇంటర్‌లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో తాము జేఈఈ మెయిన్‌లో మంచి స్కోరు సాధించినా.. ఇంటర్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన తమ అవకాశాలకు గండి కొడుతుందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి ఈ నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని కోరుతున్నారు. ఈ అంశాలన్నిటిపైనా ఎన్‌టీఏ ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు.


No comments

Powered by Blogger.